పైకప్పు కూలింది కానీ ఆ చిన్నారులు అదృష్టవంతులే!

July 10, 2026


img

నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలో పైకప్పు ఈరోజు ఉదయం ఒకవైపు కూలిపోయింది. ఆ సమయంలో విద్యార్ధులు ఆ గదిలోనే ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. సుమారు 70 ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ పాఠశాల శిధిలావస్థకు చేరుకొని చాలా కాలమే అయ్యింది. కనుక దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని గ్రామ ప్రజలు ఎప్పటి నుంచి కోరుతున్నారు. కానీ వారి గోడు పట్టించుకునే నాధుడే లేక పోవడంతో శిధిలావస్థలో ఉన్న ఆ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. 

ఈ పాఠశాలలో మొత్తం 107 మంది విద్యార్ధులు ఉండగా వారిలో నేడు 70 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో కొందరు తరగతిలోకి వెళ్ళి కూర్చున్న కొద్దిసేపటికే పైకప్పు కూలిపోయింది. ఆ గదిలో వారు రెండో వైపు కూర్చొన్నందున ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ విషయం తెలుసుకొని గ్రామ ప్రజలు పరుగున అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తక్షణమే పాఠశాలకి కొత్త భవనం నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.  

సమాచారం అందుకున్న విద్యాశాఖ, స్థానిక రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు. పాఠశాల భవనాన్ని తాత్కాలికంగా వినియోగించవద్దని ఆదేశించారు. విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా తాత్కాలికంగా గ్రామంలోని వేరే భవనంలో తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 



Related Post