తెలంగాణలో రూ. 7,5947.16కోట్లు వ్యయంతో కొత్తగా 190 కిమీ పొడవునా రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకి ఆమోదముద్ర వేశారు.
దీనిలో భాగంగా కరీంనగర్-జగిత్యాలమద్య 58.8 కిమీ, ఆర్మూర్-మంచిర్యాల మద్య 134.9 కిమీ పొడవునా రెండు హైవేలు నిర్మిస్తారు.
నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జాతీయ రహదారిలో అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టి పేట తదితర ప్రాంతాలున్నాయి.
అదేవిధంగా జగిత్యాల-కరీంనగర్ మార్గంలో పోతారం, గంగాధర వంటి పలు ముఖ్య ప్రాంతాలు ఉన్నాయి. ఈ కారణంగా జాతీయ రహదారి నం.63, 563 ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటాయి. కనుక ఈ రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ మంచిర్యాల-ఆర్మూర్ మద్య, అలాగే కరీంనగర్-జగిత్యాల మద్య మరొకటి నాలుగులేన్లతో విశాలమైన బైపాస్ రోడ్లను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఇవి అందుబాటులోకి వస్తే వీటిపై గంటకు వంద కిమీ వేగంగా వాహనాలు ప్రయాణించగలుగుతాయి. అప్పుడు ఆర్మూర్-మంచిర్యాల మద్య ప్రయాణ సమయం సుమారు గంటన్నర తగ్గుతుంది. అదేవిధంగా కరీంనగర్-జగిత్యాల మద్య ప్రయాణ సమస్యం 45 నిమిషాలు తగ్గుతుంది.