యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

May 17, 2026


img

నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్-3లో టర్బైన్‌తో నడిచే బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద నిలువ ఉంచిన డబ్బాలలో నుంచి చమురు లీక్ అవడంతో మంటలు అంటుకొని క్షణాలలో అంతటా వ్యాపించాయి.

ఆ సమయంలో సమీపంలో పనిచేస్తున్న ఇంజనీర్లు, కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. కనుక ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ కేబుల్స్, మోటార్లు, ఇంకా యంత్ర సామాగ్రి మంటలలో కాలి దగ్ధమయ్యాయి. చమురు డబ్బాలకు మంటలు అంటుకోవడంతో ప్లాంట్ అంతటా దట్టమైన నల్లటిపొగ వ్యాపించింది. 

ఇలాంటి అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు ప్రతీ పవర్ ప్లాంట్ ఫైర్ సర్వీస్ సిబ్బంది వాహనాలు సిద్ధంగా ఉంటాయి. కనుక సమాచారం అందుకున్న ఫైర్ సర్వీస్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలు ఆర్పేశారు. జెన్‌కో ఉన్నతాధికారులు కూడా అక్కడకు చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు. 


Related Post