తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోపక్క వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ మరింత మంట పుట్టించే వార్త చెప్పింది. నేటి నుంచి రాబోయే 5 రోజులు తెలంగాణలో పలు జిల్లాలలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంటుందని తెలియజేసింది. తీవ్రమైన వడగాడ్పులు కూడా వీస్తాయని కనుక అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు వెళ్ళవద్దని సూచించింది.
నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలలో 45 డిగ్రీలు పైన ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలియజేస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు మరో 16 జిల్లాలలో 41-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలియజేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలతో పాటు నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
ప్రజలు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగులతో (అలర్ట్) మ్యాపులు విడుదల చేసింది. నేటి నుంచి రాబోయే 5 రోజులలో తెలంగాణ జిల్లాలకు ఇది వర్తిస్తుంది.