తమిళనాడులో రాజకీయ అనిశ్చితికి తెర పడింది. ఈరోజు సాయంత్రం వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐఐయుఎంఎల్) రెండు పార్టీలు కూడా టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించి, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలు అందజేశాయి.
టీవీకే అధినేత విజయ్ వాటిని తీసుకొని గవర్నర్ అట్లేకర్‌ని కలిసి సమర్పించగా, తాను సూచించినట్లు ప్రభుత్వం ఏర్పాటుకి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నందున విజయ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కనుక రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయ్ తమిళనాడు సిఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
టీవీకే పార్టీకి మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్ మీడియాతో మాట్లాడుతూ, “మేము డెప్యూటీ సిఎం, మంత్రి పదవుల కోసం పట్టుబట్టామనని వచ్చిన వార్తలు నిజం కావు. మేము అసలు ప్రభుత్వంలో చేరడం లేదు. ఏ పదవులు తీసుకోవడం లేదు. బయట నుంచి మద్దతు ఇస్తాము,” అని చెప్పారు.
ఐఐయుఎంఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ, “ప్రజల తీర్పుని గౌరవిస్తూ మేము టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నాము. కానీ మేము డీఎంకేతోనే కొనసాగుతాము. మేము ఎటువంటి పదవులు ఆశించడం లేదు,” అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తర్వాత మొట్టమొదట వామపక్షాలు టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించాయి. అవి కూడా తమకు మంత్రి పదవులు వద్దని చెప్పేశాయి. కనుక ఓ 5 రోజులు తీవ్ర నిరాశ, ఆందోళనతో ఉన్న విజయ్, టీవీకే పార్టీ శ్రేణులలో మళ్ళీ ఉత్సాహం కనిపించింది. .
లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే రేపు ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయిపోయినట్లే.
ప్రభుత్వం ఏర్పాటుకి 118 సీట్లు అవసరం కాగా టీవీకే పార్టీ: 107, కాంగ్రెస్ పార్టీ: 5, వామ పక్షాలు: 4, వీసీకే పార్టీ: 2, ఐఐయుఎంఎల్:2 కలిపి మొత్తం 120 సీట్లు.