బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నేడు కరీంనగర్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు హుజురాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపు ఇచ్చింది. బిజేపి, బీఆర్ఎస్ పార్టీల మద్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించింది.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ని పోలీసులు గృహ నిర్బంధం చేసి, ఆ పార్టీ ముఖ్యనేతలు ఎవరూ రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన కార్యకర్తలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. నిత్యం ప్రజలతో కళకళలాడే కరీంనగర్ బంద్ కారణంగా ఒక్కసారిగా బోసిపోయింది. మూసిన దుకాణాలు, ఖాళీ రోడ్లతో నగర వీధులలన్నీ సెలవు దినాన్ని తలపిస్తున్నట్లున్నాయి. కరీంనగర్ రోడ్లపై పోలీసులు తప్ప ప్రజలు, పార్టీల కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు.