తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ దాదాపు ముగిసినట్లే. టీవీకే పార్టీకి 108 మంది ఎమ్మెల్యేలున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటుకి మ్యాజిక్ ఫిగర్ 118. కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేలతో ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విజయ్ అభ్యర్ధన మేరకు నేడు వీసీకే పార్టీ, వామపక్షాలు టీవీకే పార్టీకి మద్దతు లేఖలు అందజేశాయి. ఆ మూడు పార్టీలకు ఆరుగురు ఎమ్మెల్యేలున్నారు. కనుక మొత్తం 119 సీట్లు అయ్యాయి.
విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచారు. కనుక వాటిలో ఒక సీటుకి రాజీనామా చేస్తే గవర్నర్ కోరినట్లు మ్యాజిక్ ఫిగర్ 118 అవుతుంది. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో వస్తే తాను తక్షణం ఆమోదించి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తానని గవర్నర్ ఆర్లేకర్ ఇప్పటికే హామీ ఇచ్చారు.
కనుక విజయ్ సమర్పించబోయే తాజా లేఖని పరిశీలించి ఆమోదం తెలపడం ఖాయంగానే కనిపిస్తోంది. గవర్నర్ ఆమోదం తెలిపి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తే, రేపే చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.