ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: భారత్‌ ఆర్మీ

May 07, 2026


img

గత ఏడాది ఇదే నెలలో సరిగ్గా ఇదే రోజున భారత్‌ త్రివిధ దళాలు కలిసి పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భీకర దాడులు చేశాయి. ఆ దాడులలో పాక్‌లోని పలు ఉగ్రవాద శిబిరాలతో పాటు పాక్‌ వాయుసేనకు చెందిన కీలక స్థావరాలపై కూడా బ్రహ్మోస్ క్షిపణులతో విధ్వంసం సృష్టించాయి.

మూడు రోజుల పాటు సాగిన ఈ దాడులలో పాక్‌ ప్రతిఘటన చాలా పేలవంగా సాగింది. చివరికి పాక్‌ పాలకులు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని వేడుకొనడంతో ఆయన జోక్యం చేసుకొని యుద్ధం ఆపించారు. లేకుంటే పాక్‌ పరిస్థితి ఏమయ్యోదో? ఎవరూ ఊహించలేరు. 

ఆపరేషన్ సిందూర్‌కి నేటితో ఏడాది కావడంతో త్రివిధ దళాధినేతలు నేడు రాజస్థాన్‌లోని జైపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

నాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ హోదాలో పని చేసిన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు దాక్కునేందుకు అవకాశం లేదని స్పష్టం చేశాము. ఎక్కడ దాక్కున్నా అంతమొందించగలమని నిరూపించి చూపాము.

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. భారత్‌ వంక కన్నెత్తి చూసినా మళ్ళీ ఎదురుదెబ్బలు తప్పవని మరోమారు ఈ సందర్భంగా పాక్‌ని హెచ్చరిస్తున్నాము. భారత్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడూ కలిసి అత్యంత సమన్వయంతో అత్యంత ఖచ్చితత్వంతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించి భారత్‌ సత్తాని యావత్ ప్రపంచ దేశాలు గుర్తించేలా చేశాము,” అని అన్నారు.

ఈ ప్రెస్‌మీట్‌లో భారత్‌ వాయుసేన డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి తదితరులు పాల్గొన్నారు. 


Related Post