సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి తనకు కాంగ్రెస్ పార్టీలో సరైన గౌరవమర్యాదలు లభించలేదని ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయనతో ఏకీభవిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. వారి విమర్శలు, ఆరోపణలకు ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయకులూ ధీటుగా జవాబిచ్చారు.
తాజాగా సిఎం రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ, “కేసీఆర్ సీనియర్లను ఎంతగా అవమానించారో విజయశాంతి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులని అడిగితే చెప్తారు. వారి పట్ల కేసీఆర్ చాలా అవమానకరంగా ప్రవర్తించిన సంగతి మరిచిపోయారా?
కేసీఆర్‌ని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో చేరిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పగలరా? కేసీఆర్‌ని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో చేరిన దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్‌కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏవిధంగా అవమానించారో మరిచిపోయారా?
చివరికి సొంత కూతురినే పార్టీ నుంచి బహిష్కరించి బయటకు వెళ్ళగొట్టారు కదా? మీరా మాకు సీనియర్లని ఏవిధంగా గౌరవించాలో చెప్పేది?” అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
సీనియర్ రాజకీయ నాయకుడు జీవన్ రెడ్డిని కూడా ఒకప్పుడు కేటీఆర్ చాలా తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అదే కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించి తండ్రి కేసీఆర్ వద్దకు తోడ్కొనిపోయారు. కనుక రాజకీయాలలో శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు ఉండరని మరోసారి నిరూపించారు.