ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 5 విమానాశ్రయాలున్నాయి. కొత్తగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాల మద్య భోగాపురం వద్ద శరవేగంగా నిర్మిస్తున్నారు. దీనికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు ఖరారు చేశారు. ఇప్పటికే ఈ విమానాశ్రయం పనులు 70శాతం పైగా పూర్తయ్యాయి.
వడ్డించేవాడు మనోడే అయితే ఎక్కడ కూర్చున్నా ప్లేట్లో అన్ని వచ్చి పడతాయన్నట్లు టీడీపికి చెందిన రాంమ్మోహన్ నాయుడే పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉన్నందున భోగాపురం విమానాశ్రయం నిర్మాణపనులు శరవేగంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
జూన్ 4వ తేదీన ఇక్కడి నుంచి విమానసేవలు ప్రారంబించాలని సిఎం చంద్రబాబు నాయుడు గడువు విధించినప్పటికీ ఒక నెల ఆలస్యంగా అంటే జూలై 5న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా దీని ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. కనుక ఆయన షెడ్యూల్ ప్రకారం జూలై 5, ఆగస్ట్ 17, ఆగస్ట్ 19 తేదీలలో ఎప్పుడైనా సమయం కేటాయించాలని కోరుతూ పీఎంవోకి లేఖ వ్రాశారు.
ఏపీలో సిఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి ఇంకా రెండేళ్ళు కూడా కాలేదు. కానీ అప్పుడే భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తున్నారు.