ఈ నెల 23న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక తమిళనాడులో అధికార డీఎంకే-కాంగ్రెస్ కూటమి, విపక్ష అన్నాడీఎంకే-బిజేపి కూటమి, టీవీకే పార్టీతో ఒంటరిగా బరిలో దిగిన విజయ్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో విజయ్ చివరిగా నటించిన ‘జన నాయగన్’ సినిమా నుంచి ఒక పాట, 5 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వీటిపై జన నాయగన్ చిత్ర బృందం పోలీసులకు పిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా జనవరిలో సంక్రాంతికి విడుదల కావాల్సిన జన నాయగన్ నేటికీ విడుదల కాలేదు. దీని కోసం సదరు సినీ నిర్మాణ సంస్థ న్యాయపోరాటాలు చేసినా ‘జన నాయగన్’కి విముక్తి లభించలేదు. కానీ ఈలోగా శాసనసభ ఎన్నికలు వచ్చేశాయి. కనుక విజయ్ దళపతి ఆ హడావుడిలో పడిపోయారు.
ఎన్నికలు లేని సాధారణ రోజులలో ఈవిధంగా సినిమా లీక్ అయితే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. కానీ మరో రెండు వారాల్లో ఎన్నికలు జరుగబోతున్న ఈ తరుణంలో విజయ్ దళపతిని గొప్ప రాజకీయ నాయకుడుగా చూపించే జన నాయగన్ సినిమా వీడియోలు లీక్ అయితే ఆయనకు, టీవీకే పార్టీకి ఎంతో కొంత లబ్ది కలిగిస్తాయి తప్ప నష్టం కలిగించవు. కనుక ఈ లీకేజ్ విజయ్ దళపతి ప్లాన్‌నా? అని అనుమానించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఈ ఎన్నికలలో టీవీకే పార్టీ విజయం సాధించడానికి ఈ లీకులు ఉపయోగపడితే అధికారంలోకి వచ్చాక నిర్మాతకు కలిగిన నష్టాన్ని విజయ్ దళపతి పూడ్చేయగలరు. కనుక ఈ లీకేజీ ఆయన ఆలోచనే కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవునో కాదో పోలీసులే కనిపెట్టాలి.