మూడు నెలల్లో వరంగల్‌ విమానాశ్రయానికి భూమిపూజ

April 09, 2026


img

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి ఓ శుభవార్త చెప్పారు. ఈ ఏడాది జూలై నెలాఖరులోగా వరంగల్‌ మామునూరు విమానాశ్రయానికి భూమిపూజ చేసి పనులు మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు. వారిరువురూ బుధవారం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన తర్వాత ఈ విషయం ప్రకటించారు. 

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కానీ మాజీ సిఎం కేసీఆర్‌ ప్రధాని మోడీపై కత్తులు దూస్తూ చాలా అవమానకరంగా ప్రవర్తిస్తుండటంతో విమానాశ్రయాల ప్రతిపాదనలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. కాంగ్రెస్‌, బిజేపిలు బద్ధ శత్రువులైనప్పటికీ సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ పట్ల గౌరవమర్యాదలతో వ్యవహరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా వరంగల్‌ మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకి సహకరిస్తోంది.            

ఆదిలాబాద్‌లో రక్షణశాఖ అధీనంలో 360 ఎకరాలలో పాత ఎయిర్ స్ట్రిప్ ఒకటుంది. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మరో 450 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో అక్కడ కూడా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు రక్షణశాఖ మంత్రి అంగీకరించారని వారు తెలిపారు. 

ఈ విమానాశ్రయాన్ని రక్షణశాఖ నిర్మించి వాడుకుంటుంది. పౌరవిమాన సేవల కోసం పక్కనే వేరే టెర్మినల్ నిర్మిస్తుందని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెల 17 రక్షణ, పౌరవిమానయానశాఖ, తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఆదిలాబాద్‌లో పర్యటించి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం ఇవ్వజూపిన భూమి విమానాశ్రయం ఏర్పాటుకి అనుకూలంగా లేదని తెలిపారు. ఇదే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మరో సరైన ప్రదేశం ప్రతిపాదించమని సూచించామని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 


Related Post