ధనిక రాష్ట్రమని నువ్వే చెప్పావుగా మరిన్ని అప్పులు దేనికి?

April 10, 2026


img

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ మనది చాలా ధనిక రాష్ట్రమని పదేపదే చెప్పేవారు. అది వాస్తవం కూడా. హైటెక్ సిటీ, సైబరాబాద్, అనేక ఐటి, ఫార్మా కంపెనీలతో నిండిన హైదరాబాద్‌ నగరం తెలంగాణ రాష్ట్రాన్ని కామధేనువులా ఆదుకుంది. నేటికీ ఆదుకుంటూనే ఉంది.

కానీ కేవలం 10 ఏళ్ళలో అంటే కేసీఆర్‌ గద్దె దిగిపోయే సమయానికి తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏకంగా రూ.8 లక్షల కోట్ల అప్పులు పేరుకుపోయాయి. ప్రభుత్వాదాయంలో సగం వాటి వాయిదాలు, వడ్డీలకే సరిపోతోందని సిఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో చెపుతుంటారు కూడా.

కాంగ్రెస్‌  ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, హరీష్‌ రావు పదేపదే ఆరోపిస్తుంటారు. వారికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటుగా బదులిచ్చారు.

ఈరోజు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతికి అప్పగిస్తే రూ.8 లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు. ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ సక్రమంగా పూర్తి చేయగలిగారా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి అనుమతులే లేవు. కానీ దానిని 80 శాతం పనులు పూర్తిచేశామని నిసిగ్గుగా అబద్దాలు చెపుతున్నారు. మేము ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే దానికీ అడ్డుతగులుతూ రాజకీయాలు చేస్తున్నారు,” అని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్‌ పార్టీ నేతలను ఆక్షేపించారు.  


Related Post