డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అభివృద్ధికి నిదర్శనం అంటుంది బిజేపి. బిహార్‌లో ఉన్నది అలాంటి డబుల్ ఇంజన్ సర్కారే! కనుక బిహార్‌లో అభివృద్ధి ఆషామాషీగా ఉండదు.
అదే స్థాయిలో ఉందో చూడాలంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని ఓసారి చూడాల్సిందే. బిహార్‌లో సివాన్ జిల్లాలో ఓ పల్లెటూరులో ఇటీవల పదో తరగతి పరీక్షలు జరిగాయి. అయితే అక్కడ పరీక్షా కేంద్రం (ఉందో లేదో తెలీదు)లో కూర్చునేందుకు, పరీక్ష వ్రాసేందుకు బల్లలు వంటివేవీ లేకపోవడంతో, పరీక్షల నిర్వాహకులు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు.
ఆ ఊర్లో రోడ్డుకి ఇరువైపులా 10 అడుగుల దూరానికి ఓ విద్యార్ధి చొప్పున వరుసగా కూర్చోబెట్టి పరీక్షలు వ్రాయించారు. వారు రోడ్డు పక్కన కూర్చొని పరీక్షలు వ్రాస్తుంటే, వారి పక్క నుంచే ఊళ్ళో జనం వాహనాలపై సాగిపోతున్నారు. నిర్వాహకులు సైకిల్ వేసుకొని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రోడ్డుపై తిరుగుతూ విద్యార్ధులు కాపీ కొట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడైనా పాఠశాలలు శిధిలావస్థకు చేరుకుంటే ఆవరణలో చెట్ల కింద పాఠాలు చెపితే అందరూ విచిత్రంగా చూస్తారు. కానీ ఈ విచిత్రం ముందు అన్ని విచిత్రాలు దిగదుడుపేగా!
కొస మెరుపు: మొన్నటి వరకు నితీష్ కుమార్ సిఎంగా ఉండగా బిహార్ ఈ స్థాయికి అభివృద్ధి చేశారు. అయనని రాజ్యసభకి పంపించి, ఇప్పుడు బిజేపి ఆ పదవి తీసుకుంటోంది. కనుక బిహార్ మరెంత అభివృద్ధి చెందబోతోందో చూసి తీరాల్సిందే!
(video source: Big TV Breaking News)