డీలిమిటేషన్ వద్దు.. ముందుకు వెళ్తే ఉద్యమాలే: సిఎం రేవంత్!

April 11, 2026


img

శాసనసభ, లోక్‌సభ సీట్లు 50 శాతం పెంచాలనే ప్రతిపాదనపై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మరోసారి తన వాదన బలంగా వినిపించారు. 

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటికీ సౌత్, నార్త్ ఇండియా అనే తేడా చూస్తూనే ఉన్నాము. సౌత్ ఇండియా దేశానికి ఆర్ధిక రాజధానిగా నిలుస్తుంటే, నార్త్ ఇండియా రాజకీయ రాజధానిగా నిలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయంలో వాటికి న్యాయమైన వాటా దక్కడం లేదు. 

ఇప్పుడు ఈ డీలిమిటేషన్‌తో ఉత్తరాదిలో లోక్‌సభ సీట్లు గణనీయంగా పెరుగుతాయి. అప్పుడు దక్షిణాది ఓట్లు, సీట్లు అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇదే కేంద్రం ప్లాన్. 

ఇది రాజకీయ పార్టీలకు సంబందించిన అంశం కాదు. దక్షిణ భారత అస్తిత్వానికి సంబందించిన సమస్య. కనుక దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా ముందుకు వెళితే నాడు రైతు వ్యతిరేక చట్టాన్ని అడ్డుకున్నట్లే, దీనిని అడ్డుకునేందుకు అందరినీ కలుపుకొని ఉద్యమిస్తాం. 

మహిళా రిజర్వేషన్స్, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలు. కేంద్రం రెంటినీ ముడిపెట్టి రాజకీయాలు చేస్తుండటం సరికాదు. డీలిమిటేషన్‌తో ముడి పెట్టకుండా మహిళా రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ముందుగా జనాభా లెక్కలు, వాటితో పాటు కుల గణన కార్యక్రమం పూర్తి చేసి దాని ప్రకారం మహిళా రిజర్వేషన్స్ అమలు చేయాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 


Related Post