మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీస్

March 25, 2026


img

పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ సుప్రీంకోర్టు తీర్పుతో సుఖాంతం అయ్యిందనుకుంటే మళ్ళీ మొదటికొచ్చింది. బిజేపి శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి స్పీకర్‌ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు, స్పీకర్‌ (ట్రిబ్యునల్)కు నోటీసులు పంపింది. తాజాగా మరో ఆరుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు పంపింది.

నోటీసులు అందుకున్నవారిలో అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు ఉన్నారు. వీరందారినీ ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్‌ 16కి వాయిదా వేసింది. 

స్పీకర్‌ తీర్పుపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టడం ఆశ్చర్యకరమే. దీనిపై ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పుని ప్రస్తావిస్తూ తమకి ఈ కేసు నుంచి విముక్తి కల్పించమని కోరవచ్చు. కానీ స్పీకర్‌ కార్యాలయం ఏవిధంగా స్పందిస్తుందనేదే ఆసక్తికరం.


Related Post