ఓ పక్క అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసింది.. చర్చలు జరుగుతున్నాయి. త్వరలో హోర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెపుతుంటే, యుద్ధం వలన భారత్‌లో పెట్రోల్, డీజిల్ నిల్వలు అడుగంటిపోయాయి.
ఇక పెట్రోల్, డీజిల్ దొరకడం కష్టమేనంటూ కొందరు పుకార్లు పుట్టిస్తుండటంతో మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో అన్ని పెట్రోల్ బంకుల వద్ద వందలాదిమంది వాహనాలతో క్యూ కట్టారు.
ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవడంతో నిజంగానే కొని బంకులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ అయిపోయాయి. దీంతో నో-స్టాక్ బోర్డులు పెట్టి వాహనాలు లోనికి రాకుండా బారికేడ్లు పెట్టేస్తున్నారు. దీంతో పుకార్లు నిజమేనని ప్రజలు నమ్మి అన్ని పనులు మానుకొని వాహనాలు వేసుకొని పెట్రోల్ బంకుల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ ఆకస్మిక డిమాండ్‌పై పెట్రోల్ సరఫరా కంపెనీలు స్పందిస్తూ పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కనుక ప్రజలు పుకార్లు నమ్మవద్దని ఓ ప్రకటన విడుదల చేశాయి. దేశంలో గ్యాస్ కొరత లేదని ఇలాగే చెప్పాయి. కానీ ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేసుకుంటే 10-15 రోజులైనా రావడం లేదు. కనుక కానీ ప్రజలు ప్రభుత్వాలను, ప్రభుత్వ సంస్థల మాటలు నమ్మడం మానేసి పెట్రోల్, డీజిల్ విషయంలో ఎవరి జాగ్రత్తలో వారుంటున్నారు.
హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితి నెలకుంటే కార్చిచ్చులా అన్ని జిల్లాలకు, రాష్ట్రాలకు ఇది వ్యాపిస్తుంది. అప్పుడు ఆకస్మికంగా డిమాండ్ పెరిగితే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటం ఖాయం. కనుక ఈ సమస్య ఇంకా విస్తరించకూడదనుకుంటే ప్రభుత్వాలు, చమురు కంపెనీలు తక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం.