హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి బిజేపి అభ్యర్ధిగా పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన మాధవీలత అప్పటి నుంచి ఏదో విధమైన వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె ఢిల్లీ విమానాశ్రయంలో ముస్లిం మహిళలు నమాజ్ చేసుకునే ప్రార్ధనా మందిరంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని గట్టిగా దుర్గా స్తోత్రం చదివారు.
అక్కడ నమాజ్ చేసుకుంటున్న మహిళలు అభ్యంతరం చెప్పినా ఆమె పట్టించుకోలేదు. విమానాశ్రయంలో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఆమెకు నచ్చజెప్పి బయటకు పంపించేశారు. ప్రతీ హిందువు తప్పనిసరిగా మూడుపూట్ల దేవుడి స్తోత్రం చేయాలని ఆమె అన్నారు.
విదేశాలలో మాదిరిగానే భారత్‌లో కూడా కొన్ని విమానాశ్రయాలు, ఆస్పత్రులలో వివిద మతస్తులు ప్రార్ధన చేసుకునేందుకు ప్రత్యేకమైన గదులు ఉంటాయి. వాటిలో ఏ మతస్థులైనా వెళ్ళి ప్రార్ధన చేసుకోవచ్చు. కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా మౌనంగా చేసుకోవడం సభ్యత. భక్తి ముఖ్యమనుకున్నప్పుడు ఆ భావనతోనే దేవుడిని ఆరాధించాలి. కానీ దేవుడి ఆరాధన పేరుతో ఇతర మతస్తులను ఇబ్బంది పెట్టాలని, లేదా రెచ్చగొట్టాలనుకుంటే అప్పుడు ఆ భక్తి నటనగా మిగిలిపోతుంది.
మాధవీలత అదే చేశారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆమె కేవలం ముస్లింలని రెచ్చగొట్టేందుకే ఈవిధంగా చేశారని, అందుకే వీడియో తీయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పలువురు విమర్శిస్తున్నారు. కానీ ఇలాంటి విమర్శలను పట్టించుకునే రకం కాదు మాధవీలత!