ఫార్ములా 1 రేసింగ్ కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఏసీబీ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ని ఏ-1గా పేర్కొనడంపై ఆయన స్పందించారు. “ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను, అసమర్ధతని కప్పిపుచ్చుకొంటూ ప్రజల దృష్టి మళ్ళించడానికే ఈ తప్పుడు కేసు బనాయించి ఛార్జ్ షీట్‌లో నా పేరు చేర్చింది.
ఈ కేసులో ఎవరికి అనుచితంగా లబ్ది కలిగించామని వాదిస్తున్నారో ఛార్జ్ షీట్‌లో వారి పేర్లే లేవు. రూ.45 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నప్పుడు ఆ డబ్బుని ఇంతవరకు ఎందుకు రికవరీ చేయలేదు? దీనిని బట్టి ఇది ఎటువంటి సాక్ష్యాధారాలు లేని తప్పుడు కేసని స్పష్టమవుతోంది. నాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకముంది. దీనిపై కడ వరకు న్యాయపోరాటం చేస్తాను,” అని అన్నారు.
ఈ సందర్భంగా గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల గురించి ప్రస్తావిస్తూ, “హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాడానికని రూ.200 కోట్లు ఖర్చు చేశారు. దాంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా? దాంతో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పగలరా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.