లోక్‌సభ, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలోనే ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణలు చేసి ఆమోదముద్ర వేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రకారం తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న 119 సీట్లు 179కి పెరుగుతాయి. ఇదేవిధంగా రాష్ట్రంలో గల లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయి.
పొరుగు రాష్ట్రం ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి, లోక్‌సభ 25 నుంచి 38కి పెరుగుతాయి.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి ప్రస్తుతం 4,123 అసెంబ్లీ సీట్లు 6,185కి పెరుగుతాయి. లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి.
ఈ పార్లమెంట్ సమావేశాలలోనే చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ కల్పించే బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుని కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ బిల్లులకు పార్లమెంట్ ఆమోదముద్ర వేస్తే డీలిమిటేషన్ కోసం కమీషన్ ఏర్పాటు చేస్తుంది. అది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేస్తుంది.
జనగణన కార్యక్రమం 2027, మార్చి 1కి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ముందే గడువు పెట్టుకున్నందున, అది పూర్తికాగానే పెరిగిన జనాభాకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్స్, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ లెక్కలు తేల్చి ఆ ప్రకారమే 2029 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.