ఏపీలో జనసేనకు చెందిన పోలవరం ఎమ్మెల్యే సిహెచ్ బాలరాజు నుంచి సైబర్ నేరగాళ్ళు రూ.12 లక్షలు కొట్టేశారు. ఏపీ ఆర్టీవో నుంచి ఎమ్మెల్యే వాహనానికి రూ.350 చలాన్ చెల్లించాలంటూ ఎమ్మెల్యే ఫోన్కి ఓ మెసేజ్ వచ్చింది. దాంతో బాటు చలాన్ చెల్లింపుకి ఓ లింక్ వచ్చింది.
అది ఏపీ ఆర్టీవో నుంచే వచ్చిందనుకొని ఎమ్మెల్యే ఆ లింక్ క్లిక్ చేయగానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే అయన బ్యాంక్ ఖాతా నుంచి రూ.12 లక్షలు విత్ డ్రా అయినట్లు వరుసగా మెసేజులు వచ్చాయి.
వాటిని చూసి లబోదిబోమంటూ ఆయన ఏపీ సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు పరిగెత్తారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసి ఆ సొమ్ము తిరిగి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
నాలుగైదు వారాల క్రితం సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ సతీమణిని సైతం షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగళ్ళు ఏకంగా రూ.2.30 కోట్లు దోచేశారు. అందుకే తెలంగాణ పోలీస్ ముఖ్యంగా హైదరాబాద్ సీపీ విసి సజ్జనార్ పదేపదే సోషల్ మీడియాలో సైబర్ నేరాలు జరుగుతున్న తీరు వివరిస్తూ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూనే ఉంటారు.