ఇంటర్, ఐటిఐ, ఏటిసి విద్యార్ధులకు శుభవార్త!

March 20, 2026
img

తెలంగాణ ఇంటర్, ఐటిఐ, ఏటిసి విద్యార్ధులకు ఓ శుభవార్త! రాష్ట్ర ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇంటర్, ఐటిఐ, ఏటిసి విద్యార్ధులకు వారలు ప్రకటించారు. ఇంతవరకు పదో తరగతి వరకే మధ్యాహ్నం భోజన పధకం లభిస్తోంది. ఇక నుంచి ఇంటర్ విద్యార్ధులకు కూడా మధ్యాహ్నం భోజన పధకం అమలు చేస్తామని మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఆర్ధిక స్తోమతు లేని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్ధులే సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువుకుంటారు. కనుక వారి బీదరికం, ఆకలి చదువులకు అడ్డుకారాదనే సదుద్దేశ్యంతో ఈ పధకాన్ని జూనియర్ కాలేజీలకు కూడా వర్తింపజేస్తున్నామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 

ఇక ఐటిఐ, ఏటిసిలలో సాంకేతిక విద్యనభ్యసించే విద్యార్ధులకు కూడా మంత్రి భట్టి విక్రమార్క గొప్ప శుభవార్త తెలిపారు. ఇక నుంచి ప్రతీ విద్యార్ధికి నెలకు రూ.2,000 చొప్పున ఉపకార వేతనం (స్కాలర్ షిప్) ఇస్తామని ప్రకటించారు. అలాగే నడవలేని దివ్యంగ విద్యార్ధులకు  రెట్రో-ఫిట్టడ్‌ మోటరైజ్డ్ వెహికల్స్ (మోటారుతో నడిచే త్రిచక్ర వాహనాలు) అందిస్తామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 

బీదరికం, అంగవైకల్యం చదువులకు అవరోధం కారాదని, అందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 


Related Post