ఇంతకాలం ప్రభుత్వం-ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థని ఈ మార్చి నెలాఖరులోగా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది. హైదరాబాద్ మెట్రో నష్టాలలో కూరుకుపోతుండటంతో దీనిని నిర్మించి నిర్వహిస్తున్న ఎల్&టి కంపెనీ చేతులెత్తేసింది.
కనుక తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం ఎల్&టి కంపెనీతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి, మెట్రో ఆస్తులు, అప్పులు, బదిలీ ప్రక్రియ గురించి విస్తృతంగా చర్చించింది. ఇరు పక్షాలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కనుక తెలంగాణ ప్రభుత్వం రూ.15,000 కోట్లు చెల్లించి హైదరాబాద్ మెట్రోని పూర్తిగా స్వాధీనం చేసుకోబోతోంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వం మెట్రో బాధ్యతలు ఎవరికి అప్పగిస్తుంది? మెట్రో నిర్వహణలో ఎంతో అనుభవం ఉన్న ఎల్&టి కంపెనీ నిర్వహించలేకపోయిన హైదరాబాద్ మెట్రోని తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా నిర్వహిస్తుంది? కొత్తగా ఎటువంటి నియమ నిబంధనలు తెస్తుంది? వంటివి చాలా ఆసక్తికరంగా మారాయి.