పీసీసీ అధ్యక్షుడు కూడా నచ్చజెప్పలేకపోయారుగా!

March 24, 2026


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత జీవన్ రెడ్డి రేపు (బుధవారం) పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించడంతో తుది ప్రయత్నంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తదితరులు ఆయన నివాసానికి చేరుకొని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ పార్టీ రాష్ట్ర అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి పార్టీలో కొనసాగాలేనని స్పష్టం చేశారు.

ఆనవాయితీ ప్రకారం వారు ఆయన మెళ్ళో కాంగ్రెస్‌ కండువా వేయబోతే వేసుకునేందుకు నిరాకరించారు. అనంతరం మహేష్ కుమార్‌ గౌడ్‌ బయట మీడియాతో మాట్లాడుతూ, “2023 ఎన్నికల తర్వాత నుంచి పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలతో తాను చాలా బాధపడ్డానని జీవన్ రెడ్డి చెప్పారు.

పార్టీ ఎందుకు అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో ఆయనకు వివరించి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాము. కానీ కార్యకర్తలతో సంప్రదించి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

ఆయన పట్ల మా అందరికీ చాలా గౌరవం ఉంది. ఆయన వంటి సీనియర్ నేత పార్టీకి చాలా అవసరం ఉంది. మా ప్రయత్నం మేము చేశాము. మరిక ఆయనిష్టం,” అని అన్నారు. 

వారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న కాంగ్రెస్‌ ఫ్లెక్సీలు కూడా అనుచరులు తొలగించారు. కనుక రేపు రాజీనామా చేయడం నూటికి నూరు శాతం ఖాయమే. తర్వాత ఏ పార్టీలో చేరుతారనేది మాత్రమే తెలియాల్సి ఉంది.



Related Post