అయ్యో పాపం! కళ్ళెదుటే మాడి మసైపోయారు!

March 11, 2026


img

మంచిర్యాల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. దండేపల్లి మండలంలోని మేదిరిపేట వద్ద ఓ పెట్రోల్ బంకు వద్ద ఉన్న ఎత్తైన ఇనుప స్టాండ్‌ని ముగ్గురు వ్యక్తులు రోడ్డుకి అవతలివైపుకి తరలిస్తుండగా అది పైనున్న 11కేవీ హై వోల్టేజ్ విద్యుత్ తీగలను తాకింది. దాంతో ఇనుప స్టాండ్ పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాకుతో ఘటన స్థలంలోనే చనిపోయారు.

వారితో పాటు స్టాండ్ తరలిస్తున్న మూడో వ్యక్తి అదృష్టవశాత్తు సరిగ్గా అదే సమయానికి దానిని వదిలి పెట్టడంతో బ్రతికిపోయాడు. ఇనుప స్టాండ్ పట్టుకున్న ఇద్దరినీ కాపాడేందుకు అతనితో సహా స్థానికులు చాలా ప్రయత్నించారు.

కానీ వారు తాడు, రబ్బరు టైరుతో వారిద్దరినీ స్టాండ్ నుంచి వేరు చేయడానికి ప్రయత్నించిన ప్రతీసారి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే వారిద్దరూ కాలి బూడిదైపోయారు. హృదయ విదారకమైన ఈ ఘటన చూసి అందరూ కంట తడిపెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Related Post