హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం హైకోర్టుకి హాజరయ్యి క్షమాపణ చెప్పారు. బతుకమ్మ కుంట భూవివాదంపై గతంలోఅంటే జూన్ 12న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా హైడ్రా అక్కడి నిర్మాణాలను కూల్చివేసింది. అందుకుగాను ఆయనపై కోర్టు ధిక్కార నేరానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సదరు భూయజమాని ఎడ్ల సుధాకర్ రెడ్డి పిటిషన్ వేశారు.
కనుక నవంబర్ 27న కోర్టుకు హాజరయ్యి వివరణ ఇచ్చుకోవాలని రంగనాథ్ ని హైకోర్టు ఆదేశించింది. కానీ ఆయన రాకపోవడంతో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సివస్తుందని హైకోర్టు హెచ్చరించింది.
కనుక రంగనాథ్ శుక్రవారం హైకోర్టుకి హాజరయ్యి ముందుగా క్షమాపణలు చెప్పుకున్నారు. ద్విసభ్య ధర్మాసనం ఆయనని క్షమించింది. కానీ బతుకమ్మ కుంట కూల్చివేతల వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.