పదేళ్ళకు పైగా ఉద్యమాలతో సుమారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాజకీయాలను శాశించిన కేసీఆర్, 2023 ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ఫామ్‌హౌసులోనే గడుపుతున్నారు. అక్కడి నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీని నడిపిస్తున్నారు.
అయినా ఇంకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వంటి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కానీ పార్టీ శ్రేణులు ధైర్యం సడలిపోకుండా కాపాడుకుంటున్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయితీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు నేడు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌసులో కేసీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ, “రాజకీయాలలో ఎల్లప్పుడూ అనుకూల పరిస్థితులే ఉండవు. అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. కష్టాలు సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని చూసి భయపడకూడదు. ధైర్యంగా నిలబడి పోరాడుతూనే ఉండాలి.
ప్రస్తుతం తెలంగాణలో గ్రామాలలో పరిస్థితి ఏమీ బాగోలేదు. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ కాస్త ఓపిక పడితే మళ్ళీ మంచిరోజులు తప్పక వస్తాయి. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తప్పక గెలుస్తుంది. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము. అప్పుడు ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయి,” అని కేసీఆర్ అన్నారు.