పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ తెలంగాణ వ్యతిరేకే: కవిత

December 03, 2025


img

కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి అంటూ ఏపీ డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మంత్రులు, బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తూనే ఉన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా నేడు ఘాటుగా స్పందించారు.

మీడియాతో మాట్లాడుతూ, “ పవన్‌ కళ్యాణ్‌గారికి మొదటి నుంచి తెలంగాణ అంటే చులకనే వ్యతిరేకభావనలే ఉన్నాయి. కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి అంటూ అయన మాట్లాడిన మాటలే ఇందుకు తాజా ఉదాహరణ. మా రాష్ట్రమే కోనసీమలా మారాలని కోరుకున్నాము తప్ప మేమేనాడు కోనసీమ చెడిపోవాలని కోరుకోలేదు.

తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మేము మా బిడ్డలను బలి ఇచ్చుకున్నామే తప్ప ఏనాడూ ఆంధ్రావాళ్ళ జోలికి పోలేదు. నేటికీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా బాగుండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ది చెందాలనే కోరుకుంటాము తప్ప ఆంధ్రాకి ఏనాడూ కీడు తలపెట్టలేదు. అలాంటి ఆలోచన మా తెలంగాణ ప్రజలకు ఎన్నడూ కలగదు కూడా.

గతంలో పవన్‌ కళ్యాణ్‌ సినిమా నటుడుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినా పర్వాలేదు. కానీ ఆయన ఇప్పుడు ఓ రాష్ట్రానికి డెప్యూటీ సిఎంగా ఉన్నారు. కనుక పొరుగు రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. తాను మాట్లాడే మాటలు యావత్ ఆంధ్రా ప్రజలకు ఆపాదించబడతాయనే విషయం పవన్‌ కళ్యాణ్‌గారు గ్రహిస్తే మంచిది,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.


Related Post