భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే భద్రాచలం శ్రీసీతారాములవారి పుణ్యక్షేత్రం, సింగరేణి, ధర్మల్ విద్యుత్ కేంద్రం గుర్తు వస్తాయి. ఇప్పుడు భద్రాద్రి జిల్లా పాల్వంచలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సస్ యూనివర్సిటీ (భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం) ఏర్పాటైంది. సిఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం దీనిని ప్రారంభించారు.
దేశంలో వివిధ యూనివర్సిటీలలో భూగర్భ శాస్త్రంలో కోర్సులు ఉన్నాయి. కానీ ఈ యూనివర్సిటీలో పూర్తిగా భూగర్భ శాస్త్రానికి సంబందించిన అంశాలు అంటే భూగర్భం, ఖనిజాలు, గనులు వంటి అంశాలతో కోర్సులు ఉంటాయి. దేశంలో భూగర్భ శాస్త్రం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు అయిన మొట్ట మొదటి యూనివర్సిటీ ఇదేనని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
అక్కడ జరిగిన బహిరంగ సభలో డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “ఈ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. త్వరలోనే యూనివర్సిటీకి భవనాలు, హాస్టల్స్, మౌలిక వసతులు కల్పిస్తాం. పూర్తి స్థాయిలో ఈ యూనివర్సిటీ అభివృద్ధి చేసే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది,” అని చెప్పారు.