మంత్రి కొండా సురేఖ మంగళవారం అర్దరాత్రి అక్కినేని నాగార్జునకు క్షమాపణలు చెపుతూ ట్వీట్ చేశారు. తాను ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని కానీ వాటి వలన అక్కినేని నాగార్జున కుటుంబం బాధపడింది కనుక పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నానని, తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నానని ఆమె ట్వీట్ చేశారు.
ఆమె బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు చేసే క్రమంలో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఆయన రూ.100 కోట్లకు ఆమెపై పరువు నష్టం దావా వేశారు.
ఈ రోజు నాంపల్లి కోర్టులో ఆ కేసు తుది విచారణ జరిపి తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించారు కనుక తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వెలువడే అవకాశం ఉంటుంది. నాగార్జున ఈ కేసు వేసిన తర్వాత ఆమె సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చెప్పారు.
ఆమె మళ్ళీ నిన్న రాత్రి క్షమాపణలు చెప్పినప్పటికీ నాగార్జున స్పందించలేదు. కనుక ఈ కేసు యధాతధంగా కొనసాగించాలని భావిస్తున్నట్లే. ఆమె సాటి మంత్రులు లేదా మరెవరి ద్వారానైనా నాగార్జునకు నచ్చజెప్పే ప్రయత్నం చేసే ఉండవచ్చు.
కనుక నాగార్జున తనంతట తాను ఆ కేసు వెనక్కి తీసుకుంటే తప్ప మంత్రి కొండా సురేఖ ఈ రూ.100 కోట్ల పరువు నష్టం కేసు నుంచి బయటపడలేరు. మహా అయితే దీనిపై ఆమె హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడుతూ మరి కొంత కాలం గడపగలరు. అంతే!