శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయ సమర భేరి’ పేరుతో బహిరంగ సభ జరిగింది. దీనిలో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఎవరూ ఊహించని శపధం చేశారు.
“వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు తప్పక గెలుచుకుంటుంది. ఒక్క సీటు తగ్గినా పూర్తిగా నాదే బాధ్యత,” అని ప్రకటించారు. ఇది కాంగ్రెస్ శ్రేణులలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెంచుతుంది. త్వరలో జరుగబోయే పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపుకి తోడ్పడుతుంది.
“కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని, మాది మూనాళ్ళ ముచ్చట అని, మా ప్రభుత్వం ఆరు నెలలో కూలిపోతుందని కొందరు అన్నారు. కానీ కలిసికట్టుగా ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకొని వారి మాటలు తప్పని నిరూపించి చూపాము.
అంతే కాదు.. వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీయే ఘన విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను.
వచ్చే ఎన్నికల నాటికి శాసనసభ, లోక్‌సభ సీట్లు పేరుగబోతున్నాయి. అలాగే మహిళలకు రిజర్వేషన్స్ కూడా అమలుకాబోతున్నాయి. కనుక కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతీ ఒక్కరికీ వచ్చే ఎన్నికలలో తప్పకుండా సీట్లు లభిస్తాయి.
ఆనాడు మువ్వన్నెల జండా చేతపట్టుకొని గడీలు బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాపాలన చేసుకుంటున్నాము. ఎన్నికలలో రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేసి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాము.
ఆర్ధిక సమస్యలున్నప్పటికీ ఎన్నికల హామీల అమలుకి వెనకాడటం లేదు. అభివృద్ధిని ఆపడం లేదు. ఎన్ని సమస్యలు ఎదురవుతున్న ధైర్యంగా ముందుకే సాగుతున్నాము.
కేసీఆర్ పేదలకు గొర్రెలు, బర్రెలు పంచి పెట్టి అవే ఎక్కువ అన్నట్లు మాట్లాడేవారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 60,000 మందికి ఉద్యోగాలు కల్పించాము. ఉద్యోగాలు, నీళ్ళ పంపకాలు దేని గురించి ఎవరితోనైనా నేను ప్రధాని మోడీ, కేసీఆర్‌లతో చర్చకు సిద్దం. వారు సిద్దమేనా?” అంటూ సిఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.