భారత్‌లో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. 26/11 ముంబయి దాడుల సూత్రధారి తహవ్వుర్ రాణాని అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చి భారత్‌కు అప్పగించడంతో పాక్ ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఈ దాడుల కోసం ఉగ్రవాదులు డ్రోన్ లేదా ఐఓడీ వంటి ప్రేలుడు పదార్ధాలను ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించాయి. ముఖ్యంగా రైల్వేశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఉగ్రవాదులు సముద్ర మార్గం లేదా నదీ మార్గాల ద్వారా దేశంలోకి జొరబడే అవకాశం ఉంది కనుక అన్ని రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే తక్షణం అదుపులోకి తీసుకొని తమకు సమాచారం ఇవ్వాలని నిఘా వర్గాలు సూచించాయి.
భారత్‌లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తరచూ దేశంలో ఎక్కడో అక్కడ పాక్ ఉగ్రదాడులు జరుగుతుండేవి. అనేకమంది అమాయక ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోతూనే ఉండేవారు.
కానీ ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరిహద్దు భద్రత, నిఘా వ్యవస్థలకి అత్యాధునిక ఆయుధాలు, పరికరాలు అందించి చాలా బలోపేతం చేయడంతో ఉగ్రదాడులు దాదాపు నిలిచిపోయాయి. పైగా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అమర్చి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అనుసంధానించడంతో ఒకవేళ ఉగ్రవాదులు దాడులు చేసినా తప్పించుకొని పారిపోలేని పరిస్థితి ఉంది.
ఇన్నేళ్ళ తర్వాత ఉగ్రవాదులు భారత్‌పై దాడులు చేసేందుకు సాహసిస్తున్నారనే విషయం కూడా మన నిఘా వర్గాలు ముందే కనిపెట్టి అప్రమత్తం చేశాయి. కనుక ఉగ్రవాదులు అటువంటి సాహసం చేయక పోవచ్చు. చేస్తే వారికీ మూడిన్నట్లే!