గత నాలుగైదు రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలకి రాచకొండ సీపీ సుధీర్ బాబు చెక్ పెట్టారు. నిన్న మంచు మనోజ్, మంచు విష్ణు ఇద్దరూ వేర్వేరుగా నేరేడ్‌మెట్‌లోని ఆయన కార్యాలయానికి వచ్చినప్పుడు, అదనపు మెజిస్ట్రేట్ హోదాలో వారిద్దరినీ విచారించారు. వారు చెప్పింది సావధానంగా విన్న తర్వాత ఇరువురుకీ వార్నింగ్ ఇచ్చారు.
మరోసారి జల్పల్లి ఫామ్‌హౌస్ వద్ద గొడవలు జరిగితే ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇద్దరూ ఒక ఏడాదిపాటు కొట్లాటలు, గొడవలకు దూరంగా ఉంటామని లిఖితపూర్వకంగా హామీ తీసుకున్నారు. అలాగే చెరో లక్ష రూపాయల పూచీకత్తు కట్టించారు.
ఆయన ఆదేశం మేరకు పోలీసులు వారిరువురిపై బైండోవర్ చేసి ఆ నిబందనలకు కట్టుబడి ఉండాలని హెచ్చరించి పంపేశారు. ఆ తర్వాత సీపీ సుధీర్ బాబు ఆదేశం మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్ళి అక్కడ మంచు సోదరులు మోహరించిన బౌన్సర్లను బయటకు పంపించేశారు. మళ్ళీ చుట్టుపక్కల కనిపిస్తే వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మోహన్ బాబు ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులు, వారి ఇంట్లో పనిచేసేవారు మాత్రమే ఉండాలని ఇతరులు ఎవరు ఉండటానికి వీల్లేదని హెచ్చరించారు.
నాలుగైదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న మంచు కుటుంబంలో గొడవలను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈవిదంగా అలవోకగా ముగించడం చాలా అభినందనీయం.