ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తన ఇద్దరు కుమార్తెలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ్ళ తన కుమార్తె ఆద్యతో కలిసి బెజవాడ కనక దుర్గమ్మని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చినందున ఆలయ అధికారులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.
ఏపీ హోమ్ మంత్రి అనిత వంగలపూడి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ తదితరులు పవన్ కళ్యాణ్‌తో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు మూలా నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా వ్యవహరిస్తుండటంతో సినిమాలు చేసేందుకు సమయం కేటాయించలేకపోతున్నారు.
కానీ హరిహర వీరమల్లు సినిమాకి కొన్ని రోజులు సమయం కేటాయించడంతో ఆయన కోసం విజయవాడలోనే సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు. కనుక ఈ సినిమా 2025, మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ఇటీవల ప్రకటించింది.
ఇదికాక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ రెండు సినిమాలు పూర్తి చేయవలసి ఉంది. వాటికి ఎప్పుడు సమయం కేటాయిస్తారో చెప్పలేని పరిస్థితి!