జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో కంగుతిన్న బీఆర్ఎస్ పార్టీకి మరో పెద్ద షాక్! ఎఫ్-1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
ఉప ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌పై కేసు నమోదు చేసి విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడం లేదని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు.
కానీ ఇప్పుడు కేటీఆర్‌ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.
ఈ కేసులో రూ.54.88 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లించారని ఏసీబీ ఆరోపించగా, ఈడీ కూడా ఈ కేసులో వేరేగా విచారణ జరుపుతోంది.
కనుక ఈ కేసులో కదలిక వస్తే కేటీఆర్ జైలుకి వెళ్ళవలసి రావచ్చు. నిజానికి గత ఏడాదిలోనే కేటీఆర్‌ని అరెస్ట్ చేయబోతున్నట్లు వార్తలు రాగా, అందుకు తాను సిద్దమేనని కేటీఆర్ అన్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తే, బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు చేతిలో పెడతారా లేదా కేసీఆర్ బయటకు వచ్చి నడిపిస్తారా? అనే కొత్త ప్రశ్న తలెత్తుతుంది.