సింగరేణి సంస్థని దెబ్బ తీసిందే కేసీఆర్‌: భట్టి

June 21, 2024


img

నేడు తెలంగాణలోని శ్రావనపల్లితో దేశంలో ఇతర రాష్ట్రాలలో గల కొన్ని బొగ్గు గనుల వేలంపాట హైదరాబాద్‌లో జరుగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో తొలిసారిగా సింగరేణి  కూడా ఆ వేలంపాటలో పాల్గొనబోతోంది. ఇప్పుడు ఈ అంశంపై కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య సరికొత్త యుద్ధం మొదలైంది. 

కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను వేలం వేస్తూ ప్రయివేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని దానిని కేసీఆర్‌ అడ్డుకుని సింగరేణిని కాపాడారని, కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో 8 మంది ఎంపీలను ఇచ్చి గెలిపిస్తే, ఆ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు సింగరేణి గనులను వేలంవేసి అమ్మేస్తున్నాయని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ కలిసి ఖమ్మంలో నిన్న మీడియా సమావేశం నిర్వహించి సింగరేణి గనుల వేలం విషయంలో సామాన్య ప్రజలకు తెలియని కొన్ని వాస్తవాలు బయటపెట్టారు. 

భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “నాడు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సన్నిహితులైన అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన ‘ఆర్ కోల్’, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ (ప్రతిమా గ్రూప్)లకు సింగరేణి  గనులను దక్కేలా చేసేందుకే 2021లో జరిగిన సింగరేణిని వేలంపాటలో పాల్గొననీయలేదు.

 తద్వారా సింగరేణి  సంస్థని కేసీఆరే దెబ్బ తీశారు. అందుకు ప్రతిగా ఆ సంస్థల నుంచి బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి చేకూరింది. కనుక ఇది ‘క్విడ్ ప్రో’ కిందే వస్తుంది. దీనిపై మేము బిఆర్ఎస్ నేతలతో చర్చకు సిద్దంగా ఉన్నాము.

తెలంగాణలో గనుల వేలంపాటలో సింగరేణిని పాల్గొనకుండా అడ్డుపడిన కేసీఆర్‌, ఒడిశాలోని బంక్వీ బ్లాక్ గనుల వేలంపాటలో పాల్గొనేందుకు సింగరేణిని అనుమతించడం గమనిస్తే ఆయన కుట్ర అర్దమవుతుంది.    

దేశంలో బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించకుండా వేలంపాట వేయాలనే బిల్లుని 2017లో బీజేపీ ప్రభుత్వమే పార్లమెంట్‌లో ప్రవేశపెడితే దానికి బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆనాడు, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు చేసిన ఆ బిల్లు వలన సింగరేణి భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా మారింది. మరో 8-9 ఏళ్ళలో సింగరేణి పరిధిలో బొగ్గు నిల్వలు లేకుండా పోతాయి. సింగరేణి  సంస్థ మూలాలను దెబ్బ తీసిందే కేసీఆర్‌ అయితే మళ్ళీ సింగరేణిని తామే కాపాడామంటూ, మేము అన్యాయం చేసేస్తున్నామంటూ కేటీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.     

ఆ రెండు సంస్థలు ఇంతవరకు బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక వాటి అధీనంలో ఉన్న గనులను తిరిగి సింగరేణికి అప్పగించాల్సిందిగా మేము బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తాము. అవసరమైతే అఖిలా పక్షంతో ప్రధాని నరేంద్రమోడీని కలిసి విజ్ఞప్తి చేస్తాము. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలనుకుంటే బిఆర్ఎస్ పార్టీ కూడా మాతో ఢిల్లీకి రావచ్చు,” అని భట్టి విక్రమార్క సవాలు విసిరారు. 


Related Post