ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రస్తావన దేనికంటే...

September 18, 2023


img

నేటి నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి. నేడు చివరిసారిగా పాత పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతున్నాయి. రేపటి నుంచి కొత్తగా నిర్మించిన భవనంలో సమావేశాలు మొదలవుతాయి. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ చరిత్రలో అపూర్వ ఘట్టాలను గుర్తుచేస్తూ సుదీర్గంగా ప్రసంగించారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభజన ఘట్టాన్ని కూడా గుర్తుచేస్తూ రాష్ట్ర విభజన సరైన పద్దతిలో జరుగలేదని, తెలంగాణ కోసం అనేకమంది బలిదానాలు చేసుకోవలసి వచ్చిందని అన్నారు. చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా వేడుకలు జరుపుకోలేని దుస్థితి నెలకొందని అన్నారు. 

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్ళుపైనే అయ్యింది. ఇప్పుడు దాని గురించి ప్రధాని మోడీ ఈవిదంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీయే తెలంగాణ ఏర్పాటు చేశారని కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి ఆమె రుణం తీర్చుకోవాలని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి సభకు సోనియా గాంధీని తీసుకురావడానికి కూడా ఇదే కారణం. 

కనుక కాంగ్రెస్‌ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ కోసం అనేకమంది బలిదానాలు చేసుకొన్న విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ గుర్తుచేస్తున్నారనుకోవచ్చు. అయితే నేటికీ రాష్ట్ర విభజన హామీలు అమలుచేయకుండా, విభజన సమస్యలు పరిష్కరించకుండా మోడీ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తోందని కేసీఆర్‌, బిఆర్ఎస్‌ నేతలు పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.


Related Post