రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఏపీలో అధికారంలోకి రాగలిగింది. అయితే 2019 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి జగన్ ప్రభుత్వం ఓ పద్దతి ప్రకారం టిడిపిని నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది.
దానిలో భాగంగానే టిడిపి హయాంలో జరిగిన అవినీతిని తవ్వితీసేందుకు ప్రత్యేకంగా మంత్రులతో ఓ కమిటీ వేసింది. ఏపీ సీఐడీ చేత వాటిపై దర్యాప్తు జరిపించి, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు తదితర టిడిపి నేతలపై వరుసపెట్టి కేసులు వేయడం ప్రారంభించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిన్న చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించిన జగన్ సర్కార్, దానిపై ఆయనకు బెయిల్ లభించక మునుపే నేడు మరో కేసు వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ అధికారులు నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ వేశారు.
ఏపీ మంత్రి రోజా చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడుతో సహాయ టిడిపి నేతలందరిపై ఇంకా చాలా కేసులు నమోదు చేయబోతున్నాము. మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేయబోతున్నాము. కనుక వారందరూ జైళ్ళకు వెళ్ళేందుకు సిద్దంగా ఉండాలి,” అని అన్నారు.
అంటే ఎన్నికలలోగా టిడిపిలో ముఖ్య నేతలందరినీ జైళ్ళకు పంపించి టిడిపిని భూస్థాపితం చేసేందుకు జగన్ సర్కార్ పక్కా ప్రణాళికతో సాగుతోందన్న మాట. ఈ లెక్కన ఏపీలో కూడా టిడిపి తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది.