బీఎస్పీతో పొత్తులకు కాంగ్రెస్‌ ప్రయత్నం మంచిదే కానీ....

September 09, 2023


img

తెలంగాణ కాంగ్రెస్‌ ఈసారి శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు తన ముందున్న అన్ని అవకాశాలను చాలా తెలివిగా వినియోగించుకొంటోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్నికలను ప్రభావితం చేయగల బలమైన నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకోగా, ఇప్పుడు బీఎస్పీతో పొత్తులకు ప్రయత్నిస్తుండటం మరో చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

రాష్ట్రంలో బీఎస్పీ సొంతంగా పోటీ చేసి గెలవలేకపోవచ్చు కానీ కాంగ్రెస్‌తో కలిస్తే రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ఓటర్లందరూ కాంగ్రెస్‌, బీఎస్పీలవైపు మొగ్గు చూపుతారని వేరే చెప్పక్కరలేదు. అందుకే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌తో పొత్తుల గురించి చర్చిస్తున్నారు. జాతీయస్థాయిలో  కాంగ్రెస్‌, బీఎస్పీల మద్య సఖ్యత ఉంది కనుక రాష్ట్ర స్థాయిలో కలిసి పనిచేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. 

అయితే పెత్తందార్ల చేతిలో ఉన్న రాజ్యాధికారం బడుగు బలహీనవర్గాల ప్రజలకు దక్కాలనే ఆలోచనతోనే ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరి గత రెండేళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఆ వర్గాలను చైతన్యపరిచేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. ఈసారి శాసనసభ ఎన్నికలలో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని, 60-71 సీట్లను బడుగు బలహీనవర్గాల అభ్యర్ధులకే కేటాయిస్తామని ప్రవీణ్‌ కుమార్‌ ఇటీవలే ప్రకటించారు.

ఇదీగాక కాంగ్రెస్ పార్టీలో రెడ్లదే పెత్తనం... వారికే అన్ని పదవులు లభిస్తుంటాయని తెలిసిందే. కనుక కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకొని ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినా ప్రవీణ్‌ కుమార్‌ ఆశయం నెరవేరదు. ఇదీగాక ఈసారి కాంగ్రెస్‌ విజయవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఆ పార్టీలోనే టికెట్ల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఇక బీఎస్పీతో పొత్తుపెట్టుకొన్నా ఎన్ని సీట్లు ఇవ్వగలదు?కనుక కాంగ్రెస్‌-బీఎస్పీ పొత్తులు కుందరాలంటే ముందు ఈ రెండు అంశాలపై వాటి నేతల మద్య అవగాహన కుదరాలి. కుదురుతుందా?


Related Post