బిఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకొన్నట్లు తెలుస్తోంది. తనకు బిఆర్ఎస్ పార్టీ కంటే తన కొడుకు రోహిత్ రాజకీయ జీవితమే ముఖ్యమని, కనుక తనొక్కడికే మళ్ళీ టికెట్ ఇచ్చి కొడుకుకి ఈయకపోతే బిఆర్ఎస్లో ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. మంత్రి హరీష్ రావుని తరమికొడతానని కూడా హెచ్చరించారు. దీంతో అప్పుడే ఆయనను తీసి బయటపడేస్తామని సిఎం కేసీఆర్ అన్నారు. కానీ ఇంతవరకు బయటపడేయకపోగా, బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసి మంత్రి హరీష్ రావుతో సహా పార్టీలో పలువురు నేతలు షాక్ అయ్యారు. అయితే మైనంపల్లి హన్మంతరావు వ్యవహారాన్ని సిఎం కేసీఆర్ స్వయంగా చూస్తున్నారు కనుక పార్టీలో ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడటం లేదు.
మరోపక్క కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి కోరుకొంటునట్లే ఆయనకు మల్కాజిగిరి సీటు, కొడుకుకి మెదక్ సీటు ఇచ్చేందుకు అంగీకరించిన్నట్లు తెలుస్తోంది. కనుక ఈ నెల 17వ తేదీన తుక్కుగూడ బహిరంగసభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సమక్షంలో మైనంపల్లి ఆయన కుమారుడు రోహిత్, మరికొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
ముందుగా హన్మంతరావు తన కుమారుడుతో కలిసి బెజవాడ కనకదుర్గమను దర్శనం చేసుకొని వస్తామని, తిరిగి వచ్చిన తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కార్యాచరణ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారో చెప్పడమే.
మైనంపల్లి హన్మంతరావు వంటి బలమైన నాయకుడు ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం ఒక నష్టమైతే, ఎన్నికలలో ఆయనను, ఆయన కుమారుడిని కూడా బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొని పోరాడవలసిరావడం మరో నష్టం అని చెప్పవచ్చు. ఒకవేళ మైనంపల్లి రెండు సీట్లు గెలుచుకొంటే, బిఆర్ఎస్ పార్టీకి అది మరో పెద్ద నష్టమే. బహుశః అందుకే చివరి ప్రయత్నంగా ఆయనను బుజ్జగించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం కూడా పెట్టేసుకొన్నారు కనుక ఆయనను ఢీకొని ఓడించగల అభ్యర్ధిని సిద్దం చేసుకోకతప్పదు.