తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌గా నేటితో నాలుగేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేను గవర్నర్‌గా ప్రజలకు సేవ చేయాలని అనుకొన్నానే తప్ప నేను ఎటువంటి రాజకీయాలు చేయలేదు. నాకు ఆ ఉద్దేశ్యం కూడా లేదు. నేను ఎవరితో కొట్లాడేందుకు ఇక్కడికి రాలేదు. ప్రజలకు సేవ చేయాలనే వచ్చాను.
ఈ నాలుగేళ్ళలో నాకున్న అనేక పరిమితుల కారణంగా తెలంగాణ ప్రజలకు నేను చేయాలనుకొన్న సేవలలో 15శాతం మాత్రమే చేయగలిగాను. ప్రజలు కూడా నా పట్ల సంతృప్తిగానే ఉన్నారని భావిస్తున్నాను. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలతోనే నేను ఈ నాలుగేళ్ళు పూర్తిచేయగలిగాను. కనుక ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
నేను కోర్టు కేసులకు, కువిమర్శలకు, ప్రోటోకాల్ ఉల్లంఘనలకు భయపడి వెనక్కు తగ్గే వ్యక్తిని కాను. నన్ను వాటితో ఎవరూ కట్టడి చేయలేరు కూడా.
నాకు సిఎం కేసీఆర్‌తో ఎటువంటి విభేధాలు లేవు. రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మద్య దూరం ఉందని నేను అనుకోవడంలేదు. నాలుగేళ్ళుగా నేను కేసీఆర్ పాలనను చూస్తూనే ఉన్నాను. ఆయన చాలా పవర్‌ఫుల్ లీడర్.
ఆర్టీసీ బిల్లుపై అనవసర రాద్దాంతం జరిగిందని నేను భావిస్తున్నాను. నేను ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకే ప్రభుత్వాన్ని వివరణ కోరాను తప్ప ఆ బిల్లును తొక్కిపట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై కూడా అనవసర రగడ జరుగుతోంది. అదేమీ రాజకీయ ఎంపిక కాదు. నిబందనల ప్రకారం అందుకు అర్హత కలిగినవారి పేర్లను సిఫార్సు చేస్తే పరిశీలించి ఆమోదిస్తాను,” అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
ఈ నెల మొదటి శ్రావణ శుక్రవారంనాడు సిఎం కేసీఆర్ ఆమెను సచివాలయానికి ఆహ్వానించి ఆవరణలో కొత్తగా నిర్మించిన ఆలయం, చర్చి, మసీదులను ఆమె చేత ప్రారంబింపజేసి, స్వయంగా ఆమెను సన్మానించి దగ్గరుండి సచివాలయం అంతా తిప్పి చూపించారు. ఆమెకు కేసీఆర్ సముచిత గౌరవం ఇవ్వడం వెనుక పరమార్ధం ఏమిటనేది పక్కన పెడితే, అందుకు ఆమె కూడా ఈవిదంగా సానుకూలంగా స్పందించారు. అయితే వారి మద్య ఈ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందో చూడాలి.