తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యుత్తమ పధకాలలో బతుకమ్మ చీరల పధకం కూడా ఒకటి. దీని ద్వారా రాష్ట్రంలో 15 వేలమందికి పైగా చేనేత కార్మికులందరికీ ఏడాది పొడవునా ఉపాది, నెలకు కనీసం రూ.15-18 వేలు ఆదాయం లభిస్తోంది. ఒకప్పుడు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొనేవారు. కానీ ఈ పధకం మొదలైనప్పటి నుంచి వారికి ఊపిరి సలపనంతగా చేతి నిండా పని లభిస్తోంది. ఇది చూసి బీడీ కార్మికులు, ఇతర పనులు చేసుకొనేవారు కూడా బతుకమ్మ చీరల తయారీలో పాలుపంచుకొంటూ ఉపాధి పొందుతున్నారు. ఇది ఖచ్చితంగా మరో శుభపరిణామమే.
ఈ ఏడాది బతుకమ్మ చీరల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.350 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది కూడా చేనేత కార్మికుల టార్గెట్ కోటి చీరలు! ఇప్పటికే 90 లక్షల చీరలు తయారుచేసారు త్వరలోనే మరో 10 లక్షల చీరలను నేసి అందించబోతున్నారు.
ఈ ఏడాది 10 రంగులలో, 25 డిజైన్లతో, 250 వెరైటీల బతుకమ్మ చీరలను తయారుచేశారు. తయారైన వాటిని ఇప్పటికే జౌళి, పౌరసరఫరాల శాఖలు కలిసి జిల్లాలకు రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. అక్టోబర్ 14 నుంచి బతుకమ్మ పండుగ మొదలవుతుంది. కనుక అక్టోబర్ మొదటివారం నుంచే బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దళితబంధు, పంటరుణాల మాఫీ వంటి పధకాలతో పోలిస్తే బతుకమ్మ చీరల పధకం కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు పెద్దలెక్కలోకి రాదు. కానీ దీని ద్వారా రాష్ట్రంలో 15 వేలకుపైగా చేనేత కార్మికులు వారి కుటుంబాలు ఏడాది పొడవునా ఉపాది, ఆదాయం పొందుతున్నారు. రాష్ట్రంలో సుమారు 50-60 లక్షల మంది నిరుపేద మహిళలల మొహాలలో చిర్నవ్వులు వికసిస్తున్నాయి. వారందరూ సిఎం కేసీఆర్‌ని, కేటీఆర్‌ని మనసారా దీవిస్తున్నారు. వారి దీవెనలు చాలు!