ఇటీవల హైకోర్టు గద్వాల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించి, 2018 ముందస్తు ఎన్నికలలో ఆయన చేతిలో ఓడిపోయిన డికె అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చి మోసగించిన కారణంగా హైకోర్టు ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది.
కనుక డికె అరుణ శుక్రవారం ఉదయం రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులుని కలిసి హైకోర్టు ఉత్తర్వు కాపీలను అందజేసేందుకు వెళ్ళగా ఆయన లేకపోవడంతో ఆయన సిబ్బందికి అందజేసి వెనుతిరిగారు. తాను ఈరోజు ఉదయం ఆయనను కలిసేందుకు వస్తున్నట్లు ముందుగా సమాచారం ఇచ్చినా, ఆయన మొహంచాటేయడంపై డికె అరుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా వెళ్ళి హైకోర్టు ఉత్తర్వు కాపీలను అందజేసి తనను ఎమ్మెల్యేగా ధృవీకరణ పత్రాన్ని అందజేయాలని కోరారు.
ఇంతకు ముందు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కూడా ఇదే కారణంతో హైకోర్టు అనర్హత వేటు వేసి ఆయన చేతిలో ఓడిపోయిన జలగం వెంకట్ రావుని ఎమ్మెల్యేగా ప్రకటించింది. కానీ వనమా హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేయగా స్టే విధించింది. కృష్ణమోహన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కనుక ఆయన అనర్హత కేసుపై కూడా సుప్రీంకోర్టు విధించవచ్చు.
కనుక రాబోయే రోజుల్లో హైకోర్టు మరికొంతమందిని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులిగా, వారి చేతిలో ఓడిపోయినవారిని ఎమ్మెల్యేలుగా ప్రకటించినా ఇదే జరుగవచ్చు. వనమాపై హైకోర్టు అనర్హత వేటు వేసినప్పటికీ సిఎం కేసీఆర్ కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు ఆయనకే అవకాశం కల్పించారు. హైకోర్టులో అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ తొలి జాబితాలోనే అభ్యర్ధులుగా ప్రకటించారు.