ఈసారి శాసనసభ ఎన్నికలలో కల్వకుంట్ల కవితకు తప్పకుండా నిజామాబాద్ నుంచి పోటీ చేసేందుకు కేసీఆర్ టికెట్ ఇస్తారని అందరూ భావించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల జాబితాలో ఆమె పేరు లేదు. ఇక మిగిలిన జనగామ, నాంపల్లి, ఘోషామహల్, నర్సాపూర్ నాలుగు నియోజకవర్గాలతో ఆమెకు సంబంధం లేదు. ఒకవేళ ఆమె శాసనసభలో అడుగుపెడితే ఈసారి మహిళల కోటాలో ఆమెకు మంత్రి పదవి కూడా ఈయవచ్చని ఊహాగానాలు వినిపించాయి. కనుక ఈసారి కూడా ఆమెకు శాసనసభలో అడుగుపెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను ఈడీ ఢిల్లీలో విచారణకు పిలిచినప్పుడు, చట్టసభలలో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రెండు రోజులు ఢిల్లీలోనే ఆమె ధర్నాలు చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు తన పోరాటం కొనసాగుతుందని చెప్పి ఆ తర్వాత దాని సంగతి మరిచిపోయారు. అదివేరే సంగతి.
కానీ ఆమె ఎమ్మెల్సీగా ఉన్నందున టికెట్ ఇవ్వలేదనుకొన్నా ఈసారి కూడా 119 సీట్లలో కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే కేసీఆర్ టికెట్స్ ఇచ్చారు. కనుక మహిళా రిజర్వేషన్ల గురించి కల్వకుంట్ల కవిత ముందుగా బిఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత పోరాటం చేయాలేమో?
ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక కేసీఆర్ ఆమెను మళ్ళీ నిజామాబాద్ నుంచే లోక్‌సభకు పోటీ చేయించే అవకాశం ఉందని భావించవచ్చు.