అలనాటి అందాల తెలుగు నటి, మాజీ ఎంపీ జయప్రదని బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రాలో కూడా విస్తరించి అక్కడ కూడా పోటీ చేయాలనుకొంటోంది కనుక పలు హిందీ సినిమాలలో నటించిన జయప్రదను మహారాష్ట్రలోనే బిఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో దింపాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకొంటున్నారు కనుక ఆమెను లోక్‌సభకే పోటీ చేయించే అవకాశం ఉంది. ఆమె కూడా చాలా కాలంగా ఏదో ఓ పార్టీలో చేరి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడి నుంచైనా ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్నారు. కానీ మహారాష్ట్ర నుంచి అవకాశం ఆమె తలుపు తట్టింది.
ఆమె ఇదివరకు ఉత్తర ప్రదేశ్ నుంచే పోటీ చేసి గెలిచారు కనుక మహారాష్ట్ర నుంచి పోటీ చేయడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు. కేసీఆర్ అండదండలతో గెలవడం ఆమెకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఆమెతో పాటు బాలీవుడ్ నుంచి మరికొందరిని బిఆర్ఎస్ పార్టీలోకి రప్పించి మహారాష్ట్రలో బరిలో దింపాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మహారాష్ట్రలో కేసీఆర్ పక్కా ప్లాన్‌తోనే ముందుకు సాగుతున్నట్లు భావించవచ్చు.