మొన్న శుక్రవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో లక్షిత అనే ఆరేళ్ళ చిన్నారిని చిరుత ఎత్తుకుపోయి చంపేయడంతో టీటీడీ అప్రమత్తమైంది. అటవీ సిబ్బంది ఏర్పాటు చేసిన బోనులో ఇప్పటికే ఓ చిరుత చిక్కగా నిన్న మరో చిరుత కూడా చిక్కింది. అయినప్పటికీ కొండ చుట్టూ ఉన్న అడవులలో ఇంకా ఎన్ని చిరుతలు ఉన్నాయో తెలీదు కనుక టీటీడీ మెట్లమార్గంలో భక్తుల సంచారాన్ని నియంత్రిస్తూ దివ్యదర్శనం టోకెన్ల సంఖ్యను రోజుకి 9 వేలకు తగ్గించింది. ప్రతీ 10 మీటర్లకు ఒకరు చొప్పున మెట్ల మార్గంలో భద్రతా సిబ్బందిని నియమించింది. మెట్ల మార్గాన్ని అనుకోని దట్టమైన చెట్లు ఉండేచోట అదనంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయించింది.
ఇవి ఏర్పాటు చేసిన తర్వాత శనివారం సాయంత్రం నడక మార్గంలో, ఘాట్ రోడ్డులో 5 ప్రాంతాలలో చిరుతలు సంచరించిన్నట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి 7 గంటలకు 2,450 మెట్టు వద్ద మరో చిరుత సంచరించిన్నట్లు గుర్తించారు. ఇంకా పలు ప్రాంతాలలో చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ గుర్తించింది. కనుక వాటి నుంచి భక్తులకు ఏవిదంగా భద్రత కల్పించాలనే దానిపై టీటీడీ, పోలీస్, అటవీ శాఖల అధికారులు చర్చిస్తున్నారు.
ముందుగా చిరుతల వలన చిన్న పిల్లలకు ప్రమాదం పొంచి ఉన్నందున మధ్యాహ్నం 2 గంటల వరకే వారికి తల్లితండ్రులతో కలిసి మెట్ల మార్గంలోకి అనుమతిస్తున్నారు. మెట్లమార్గంలో 7వ మైలురాయి వద్ద పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేసి, చిన్నారులకు వారి తల్లితండ్రులు, ఫోన్ నంబర్లు, పోలీసుల టోల్‌ఫ్రీ నంబర్లతో కూడిన ట్యాగ్స్ వేస్తున్నారు. ఒకవేళ పిల్లలు తప్పిపోయినా వాటి సాయంతో సులువుగా తల్లితండ్రులకు చేర్చవచ్చు.
ఇక శ్రీవారిమెట్టు,అలిపిరి మార్గాలలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 ఏళ్ళలోపు పిల్లలను తల్లితండ్రులు లేదా బంధువులతో కొండపైకి వెళ్ళేందుకు అనుమతిస్తారు. శ్రీవారిమెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి మెట్ల మార్గంలో రాత్రి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి కొండపై రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ నిషేధం విధించింది.