జగన్ ప్రభుత్వానికి చిరంజీవి వాతలు... అబ్బా!

August 08, 2023


img

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్‌ జంటగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా 200 రోజులు పూర్తిచేసుకొన్న సందర్భంగా హైదరాబాద్‌లో సక్సస్‌ మీట్‌ జరిగింది. దానిలో పాల్గొన్న చిరంజీవి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏపీ దుస్థితిపై నిశిత విమర్శలు చేశారు. 

“మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?” అంటూ చిరంజీవి చురకలు వేశారు. 

పవన్‌ కళ్యాణ్‌ ‘బ్రో’ సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుని అనుకరిస్తూ పృధ్వీ చేత ‘శ్యామ్ బాబు’ పాత్ర చేయడంతో, అంబటి రాంబాబు బ్రో సినిమా పెట్టుబడిలో అవకతవకలు జరిగాయని, సినిమా ఫ్లాప్ అయ్యిందని, కలక్షన్స్‌ పడిపోయాయని ఏవేవో మాట్లాడుతూ తన కోపం చల్లార్చుకొంటున్నారు. మరో అడుగు ముందుకు వేసి పోలీస్ కానిస్టేబుల్ కొడుకువైన నువ్వు అంటూ పవన్‌ కళ్యాణ్‌ గురించి అనుచితంగా మాట్లాడారు. 

సినీ పరిశ్రమ నుంచి వెళ్ళి జగన్‌ పంచన చేరిన పోసాని కృష్ణ మురళిలాంటి వారు కూడా ఇండస్ట్రీ గురించి, ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీలో అందరూ పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితం గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. ఏపీలో వైసీపీ నేతలు మాట్లాడుతున్న ఇటువంటి మాటలతో ఇండస్ట్రీలో అందరూ బాధపడుతూనే ఉన్నారు. కానీ నోరు విప్పితే ఏమవుతుందో తెలుసు కనుక అందరూ మౌనంగా భరిస్తున్నారు. 

ఇంతకాలం చిరంజీవి కూడా సినీ ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్న వేలాదిమందిని, దాని బిజినెస్ వగైరాలను దృష్టిలో పెట్టుకొని మౌనంగా భరిస్తున్నారు. చివరికి ఆయన కూడా సహనం కోల్పోయిన్నట్లున్నారు. అందుకే చిరంజీవి తొలిసారిగా సున్నితంగా అయినా గట్టి చురకలే వేశారు. 

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్య్లపై స్పందిస్తూ “ సినీ పరిశ్రమలో చాలామంది పకోడీగాళ్ళున్నారు. మేము ప్రభుత్వం ఎలా నడపాలో వాళ్ళు మాకు సలహాలు ఇస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఊసు ప్రభుత్వానికి ఎందుకన్నప్పుడు ప్రభుత్వం ఊసు వారికి మాత్రం ఎందుకు? చిరంజీవి సినిమాలలో కుర్ర హీరోయిన్లతో డాన్సులు, విలన్లతో ఫైట్లు చేసుకోవచ్చు కదా?ఎవరు కాదన్నారు? అంటూ వెటకారంగా జవాబిచ్చారు. 


Related Post