రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిన్న జరిగియ చేనేత దినోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ తన ప్రసంగం చివరిలో జాతీయ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది. దానిలో బిఆర్ఎస్ కూడా ఉంటుంది. అప్పుడు రాష్ట్రానికి రావలసిన నిధులు, ఉన్నత విద్యాసంస్థలు, ప్రాజెక్టులు అన్నీ సాధించుకొని తెచ్చుకొందాము,” అని అన్నారు.
అయితే ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో తప్పక అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారని చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కేటీఆర్ చెపుతున్నారు. అంటే కేసీఆర్ వెనక్కు తగ్గారనుకోవాలా? కానీ నేటికీ మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు కదా?
కేసీఆర్ జాతీయస్థాయిలో చక్రం తిప్పాలనుకొంటున్నప్పటికీ తనకున్న ఎంపీల బలం సరిపోదనే వాస్తవం గ్రహించినట్లున్నారు. అందుకే మహారాష్ట్రలో బిఆర్ఎస్‌ను బలోపేతం చేసుకొని తెలంగాణతో పాటు ఆక్కడా కొన్ని లోక్‌సభ సీట్లు గెలుచుకోగలిగితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒకవేళ ఎన్డీయే లేదా ఇండియా కూటమిలో దేనికైనా ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు అవసరం పడితే, అప్పుడు బిఆర్ఎస్ మద్దతు కీలకం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు. అయితే ప్రధానమంత్రి పదవి చేపట్టి దేశానికి దశదిశ మార్చుతానని చెప్పుకొని ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా సర్దుకుపోయేందుకు కేసీఆర్ సిద్దపడటం నిజమైతే చాలా ఆశ్చర్యమే కదా?