టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుని పరిశీలించడానికి మరికొంత సమయం అవసరమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపిన్నట్లు రాజ్‌భవన్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆర్ధికపరమైన ఆ బిల్లుపై న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని భావిస్తున్నారని తెలిపింది.
శాసనసభ సమావేశాలకు రెండు రోజుల ముందు ఇటువంటి కీలకమైన బిల్లులు పంపించి వాటిని పూర్తిగా పరిశీలించకుండానే ఆమోదముద్ర వేయడం సాధ్యం కాదని రాజ్‌భవన్ తెలిపింది. కనుక రేపు శాసనసభ సమావేశాలు ముగిసేలోగా ఆ బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలుపరని స్పష్టమైంది.
అయితే ఆమె ఎప్పటిలోగా ఆమోదం తెలుపుతారో తెలీదు కనుక శాసనసభ సమావేశాలను పొడిగించడం కూడా సాధ్యం కాదు. కనుక ఆమె ఆమోదించిన తర్వాతే మళ్ళీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లుకు ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది.
త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికల కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నామని మంత్రి మల్లారెడ్డి ఒప్పేసుకొన్నారు. అయితే ఈవిషయం ముందుగా ప్రతిపక్షాలకు తెలియనీయకూడదనే చివరి నిమిషం వరకు రహస్యంగా ఉంచి, మంత్రివర్గ సమావేశంలో బిల్లుకి ఆమోదం తెలిపి ప్రకటించారు. అందువల్లే ఇప్పుడు బిల్లు గవర్నర్ వద్ద నిలిచిపోయింది.
గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ పడుతున్న కారణంగా ఆమె ఈ బిల్లుపై కొర్రీలు వేయవచ్చని ప్రభుత్వ పెద్దలకు తెలియదనుకోలేము. కనుక టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించుకొన్న వెంటనే ఆ ముసాయిదా బిల్లును ఆమెకు పంపించి ఉంటే నేడు ఇటువంటి సమస్య ఎదురయ్యేది కాదు.
ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు ఆమె ఆమోదం తెలుపకుండా తొక్కి పట్టి ఉంచితే, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేస్తుంది కనుక ఆ బిల్లుకి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యి మళ్ళీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు మోక్షం లభించదు.
అయితే ఆ బిల్లును గవర్నర్ తక్షణమే ఆమోదించి శాసనసభకు పంపినా, తొక్కిపట్టినా బిఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. ఆమోదిస్తే తాము ఆర్టీసీ కార్మికులకు మేలు చేస్తున్నామని చెప్పుకొని ఓట్లు అడుగుతుంది. ఆమోదించకపోతే తాము ఆర్టీసీ కార్మికులకు మేలు చేయాలనుకొంటే గవర్నర్ అడ్డుకొంటున్నారని ప్రచారం చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.