తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌తో కలిసి పనిచేసిన ఈటల రాజేందర్‌ను, ప్రభుత్వం నుంచి ఎంత అవమానకరంగా బయటకు పంపించారో అందరికీ తెలుసు. ఆ తర్వాత కూడా కేసీఆర్ ఆయనకు రాజకీయంగా సమాధి చేయాలనే పగతో రగిలిపోతూ హుజురాబాద్ ఉపఎన్నికలలో ఈటలను ఓడించేందుకు ఎంతగా ప్రయత్నించారో కూడా అందరికీ తెలుసు. ఆ తర్వాత అసైన్డ్ భూములు కాజేశారంటూ ఆయనపై కేసులు కూడా నమోదు చేయించారు. బహుశః కేసీఆర్ మరెవరి మీద ఇంత ప్రతీకారేచ్చతో రగిలిపోలేదేమో?
ఇంత చేసిన తర్వాత ఈటల రాజేందర్‌ను మళ్ళీ బిఆర్ఎస్‌లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ఈరోజు శాసనసభ సమావేశాలలో మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో ఆయన కూర్చోన్నచోటికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించారు. ఈటల రాజేందర్ కూడా హుందాగా వ్యవహరిస్తూ కేటీఆర్‌తో కాసేపు మాట్లాడారు. ఇదివరకు బడ్జెట్ సమావేశాలలో కూడా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆయన వద్దకు వెళ్ళి పలకరించి కాసేపు మాట్లాడారు.
అంటే ఈటల రాజేందర్ తిరిగి రావాలనుకొంటే బిఆర్ఎస్ పార్టీ ఆయనకు స్వాగతం చెప్పేందుకు సిద్దంగా ఉందని సంకేతాలు పంపిస్తున్నట్లే భావించవచ్చు. కానీ ఇంత అవమానం జరిగిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలోకి ఎన్నటికీ వెళ్ళే ప్రసక్తే లేదని ఈటల రాజేందర్ కుండబద్దలు కొట్టిన్నట్లు స్పష్టంగా చెపుతున్నారు. కానీ బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బిజెపిలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఒకవేళ ఎన్నికలలోగా పార్టీ పరిస్థితి మారకపోతే ఈటల రాజేందర్ మళ్ళీ బిఆర్ఎస్ గూటికి చేరుకొన్నా ఆశ్చర్యం లేదు.